విద్యార్థుల భవిష్యత్తు కోసం కేటాయించిన భూమి జీవో కాపీని చింపడం ఏమీటి..?
ఎంపీ అరవింద్ పద్ధతి మార్చుకో
రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవగీతం,హైదరాబాద్:
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏక వచనంతో మాట్లాడడం, ప్రధాని నరేంద్ర మోడీ తో సంబంధాలు ఉన్నాయని మాట్లాడడం, వ్యక్తిగతంగా సైతం మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి అడ్లూరి తెలిపారు. ధర్మపురి అరవింద్ ఆరంభమే కాంగ్రెస్ పార్టీతోనే మొదలైందని మంత్రి గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షులుగా ఉన్న డి. శ్రీనివాస్ గారి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడం సరికాదని మంత్రి హితవు పలికారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్నప్పటికీ ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మేరాసే జోడో అని మాట్లాడారంటే దాని అర్థం ఏందో ధర్మపురి అరవింద్ చెప్పాలని మంత్రి అన్నారు.రేవంత్ రెడ్డి బలమైన నాయకులు కనుక ప్రధాని మోడీ తనతో కలవాలని అన్నారని మంత్రి తెలిపారు. సామాన్య కుటుంబంలో పుట్టిన రేవంత్ రెడ్డి జిల్లా పరిషత్ సభ్యులుగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా , ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులుగా పనిచేసే ముఖ్యమంత్రిగా ఎదిగారని మంత్రి అడ్లూరి అన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ధర్మపురి అరవింద్ ముఖ్యమంత్రి పేరు తీసుకొని ఏకవచనంతో మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి తెలిపారు. నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ నిర్ణయాలను అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని మంత్రి అన్నారు. ఎన్నికల సమయంలో గ్రామ గ్రామాన తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయని వాటిపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కొనుగోలు చేయించలేని బీజెపీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. గత మూడు పంటలకు సంబంధించిన ధాన్యం నిల్వలు రైస్ మిల్లులో పేరుకు పోయాయని వాటిని ఎఫ్ సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ఎందుకు బీజేపీ నాయకులు ఒత్తిడి తీసుకురావడం లేదని మంత్రి ప్రశ్నించారు. భారతదేశంలో భాగమైన తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ఉంటే కేంద్రాన్ని ఎందుకు ఒప్పించడం లేదని బీజేపీ నాయకులను మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలోని మొక్కజొన్న రైతుల పరిస్థితి ఏమిటి..? వరి ధాన్యం కొనుగోలు మీ పాత్ర ఏమిటి.. అనే మంత్రి ప్రశ్నించారు.
దామాషా ప్రకారం కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎందుకు రావడం లేదని బీజేపీ నేతలను మంత్రి ప్రశ్నించారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా రావాల్సిన నిధులను సైతం కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని అయినప్పటికీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రతినెల బిల్లులు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై వ్యక్తిగతంగా మాట్లాడడం సమంజసం కాదని మంత్రి అడ్లూరి అన్నారు. అరవింద్ కు దమ్ముంటే మొక్కజొన్నలకు మద్దతు ధర ఇప్పించడంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రం సహకరించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని మంత్రి అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయానికి రెండెకరాల స్థలం కేటాయిస్తే జీవో కాపీని అరవింద్ చించడానికి మంత్రి అడ్డూరి తప్పుపట్టారు. నీటిపారుదల శాఖకు చెందిన అత్యంత ఖరీదైన భూమిని కేటాయించమని అవసరమైతే మరో మూడు ఎకరాల భూమి కేటాయించే వాళ్ళమని మంత్రి అన్నారు. రైతులకు ఎంతో ఉపయోగపడే పరిశోధన చేసే స్థలాన్ని ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్రీయ విద్యాలయానికి రెండు ఎకరాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు 10ఎకరాలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి కేటాయించడం జరిగిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. అలాంటి జీవో కాపీని ఎంపీ అరవింద్ చింపడాన్ని మంత్రి తప్పు పట్టారు.
కేంద్రీయ విద్యాలయానికి మరో మూడు ఎకరాల భూమి కేటాయించే వాళ్ళమని మంత్రి అన్నారు. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడం సరియైనది కాదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎప్పటికైనా ఎంపీ అరవింద్ తన మాట తీరు మార్చుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ హితవు పలికారు.

