నవగీతం,జగిత్యాల ప్రతినిధి :
జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతంగా పూర్తి చేసి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా వెంటనే మిల్లులకు తరలించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత అధికారులను ఆదేశించారు.బుధవారం జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు చల్‌గల్ గ్రామంలోని ఏఎంసీ సెంటర్‌ను ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.కేంద్రాల్లో హమాలీలు తగిన సంఖ్యలో అందుబాటులో ఉండేలా చూడాలని, ధాన్యం లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసి లారీలను ఆలస్యం లేకుండా మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ట్రక్ షీట్ నమోదు, ట్యాబ్ ఎంట్రీలు తదితర డాక్యుమెంటేషన్ పనులను సకాలంలో పూర్తి చేసి ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని స్పష్టం చేశారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత పాటిస్తూ రైతులకు సరైన సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించిన ఆమె, తేమ శాతం మరియు నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పరిశీలించాలని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవకతవకలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో డీసీఎస్ఓ జితేందర్ రెడ్డి, జగిత్యాల రూరల్ తహసీల్దార్ హకీమ్, డీటీ, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.

