జగిత్యాల అభివృద్ధిపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి
కేంద్ర విద్యాలయ స్థలం కేటాయింపును అడ్డుకుంటున్నది ఎవరు..?
జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ భోగ శ్రావణి జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం కమల నిలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అధికారిక కార్యక్రమంలో కనీస మర్యాదలను పాటించకుండా ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను విస్మరించడం బాధాకరమని అన్నారు. సభా మర్యాదల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యేకు ఉందా అని ప్రశ్నించారు. కార్యక్రమాల్లో పెయిడ్ బ్యాచ్‌లతో పార్టీ నినాదాలు చేయించడం, కావాలనే రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించడం కాంగ్రెస్ నాయకులకే అలవాటైందని విమర్శించారు.గత పాలకులు హుందాతనంతో వ్యవహరించారని, వారిని చూసైనా ప్రస్తుత ప్రజాప్రతినిధులు నేర్చుకోవాలని సూచించారు. తాను మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా కార్యక్రమాన్ని ముగించిన విషయాన్ని గుర్తు చేశారు.కోరుట్ల పట్టణం అభివృద్ధి, జగిత్యాల పట్టణం అభివృద్ధి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉన్న సమయంలో సెంట్రల్ డివైడర్లను రాళ్లతో కాకుండా కాంక్రీట్‌తో నిర్మించాలని అధికారులకు లేఖ రాసింది మీరే కాదా అని ప్రశ్నించారు.గతంలో ఎంపీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరిస్తానని చెప్పి కేంద్ర మంత్రులను కూడా కలిపించారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే స్వార్థ రాజకీయాల కారణంగానే కేంద్ర విద్యాలయానికి వాలంటరీ స్థలాన్ని కేటాయించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.వాలంటరీ స్థలంలో జరుగుతున్న అక్రమ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమృత్ 2.0 పథకం కింద రాయికల్‌కు రూ.15 కోట్లు, జగిత్యాలకు రూ.38.60 కోట్లు మంజూరైనా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు. శంకుస్థాపన చేసి సంవత్సరం గడిచినా పనులు ముందుకు సాగకపోవడం దురదృష్టకరమన్నారు. యావర్ రోడ్ విస్తరణ విషయంలో ఎమ్మెల్యే, చైర్మన్, కౌన్సిలర్లు కలిసి మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. రోడ్డును 100 అడుగులకు విస్తరించేందుకు గెజిట్ ఇప్పటికే విడుదలైందని, కొలతలు పూర్తయ్యి సంబంధిత ఏజెన్సీకి చెల్లింపులు కూడా జరిగాయని తెలిపారు. అయినప్పటికీ కొత్తగా కొలతల పేరుతో డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.అవసరమైతే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటానని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుని ప్రజల మధ్య తిరగాలని, చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే రాజకీయ బాగోతాలను ఒక్కొక్కటిగా ప్రజల ముందుకు తీసుకొస్తామని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల గొంతుకగా నిలుస్తుందని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, జిల్లా కోశాధికారి సుంకేట దశరథరెడ్డి, సిరిపురపు శ్రీనివాస్, గట్టుపల్లి జ్ఞానేశ్వర్, దూరిశెట్టి మమత, ఓడ్నాల రమేష్, గుండేటి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

