Monday, November 2, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలటీటీడీ కళ్యాణ మండపంలో సౌకర్యాలు కల్పించాలి

టీటీడీ కళ్యాణ మండపంలో సౌకర్యాలు కల్పించాలి

📰 Generate e-Paper Clip

ఈ-దర్శన్ టోకెన్ కౌంటర్‌ను పునరుద్ధరించాలి: బీజేపీ పట్టణ అధ్యక్షులు దోనికెల నవీన్

మెట్‌పల్లి,అక్టోబర్27,(నవగీతం):

మెట్ పల్లి పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో అవసరమైన సౌకర్యాలు కల్పించి, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని బీజేపీ మెట్‌పల్లి పట్టణ అధ్యక్షులు దోనికెల నవీన్ కోరారు. మంగళవారం ఆయన టీటీడీ కళ్యాణ మండపాన్ని సందర్శించి, అక్కడి ప్రస్తుత పరిస్థితులను పరిశీలించారు. మండపం నిర్వహణ, అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలు, ప్రైవేట్ ఫంక్షన్ హాళ్ల అధిక అద్దెల కారణంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు వివాహాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో టీటీడీ కళ్యాణ మండపంలో అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, తక్కువ ఖర్చుతో శుభకార్యాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.

అదేవిధంగా, గతంలో టీటీడీ కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన ఈ-దర్శన్ టోకెన్ కౌంటర్ ద్వారా భక్తులకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అందుబాటులో ఉండేవని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ సౌకర్యాన్ని తిరిగి పునరుద్ధరించాలని బీజేపీ మెట్‌పల్లి పట్టణ శాఖ తరఫున డిమాండ్ చేశారు. ఈ-దర్శన్ టోకెన్ కౌంటర్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా స్థానిక భక్తులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

సంబంధిత అధికారులు ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, కళ్యాణ మండపాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు దర్శన టికెట్ల సౌకర్యాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సామాన్య ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు, భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి బీజేపీ మెట్‌పల్లి పట్టణ శాఖ కృషి చేస్తుందని నవీన్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు జూంగుల అనిల్ గౌడ్, బత్తుల జగదీశ్వర్, పట్టణ ఉపాధ్యక్షులు గుంటుక హనుమాన్లు, ఐటీ సెల్ కన్వీనర్ పాసికంటి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు సంకు ప్రసాద్, బొమ్మన రామస్వామి, మొగిలిపాక హరికృష్ణ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular