మల్లాపూర్, నవంబర్ 4 (నవగీతం):
మల్లాపూర్ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మోరిలో జారిపడి ఓ మహిళ మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. మల్లాపూర్ గ్రామానికి చెందిన చిప్ప నడిపి లక్ష్మి (58), భర్త లక్ష్మణ్‌తో కలిసి నివసిస్తూ బీడీలు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఈ నెల 3వ తేదీ సాయంత్రం బట్టలు కొనుగోలు చేసేందుకు గ్రామంలోని స్వప్న సెలక్షన్స్‌కు వెళ్తున్నానని భర్తకు చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి అయినప్పటికీ ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు.
ఈ క్రమంలో రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో గ్రామానికి చెందిన గొట్టి పడత స్వామి తన ఇంటి ముందు ఉన్న మోరిలో లక్ష్మి పడిపోయి ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఆమెను మోరిలో నుంచి బయటకు తీసి చూడగా, తల వెనుక భాగంలో తీవ్ర రక్తగాయంతో పాటు శరీరంలోని ఇతర భాగాల్లోనూ గాయాలు కనిపించాయి.
వెంటనే చికిత్స నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలు ప్రమాదవశాత్తు మోరిలో జారిపడి మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతురాలి భర్త చిప్ప లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు మల్లాపూర్ ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.

