అర్హత ఉన్న చివరి లబ్దిదారుడి వరకు సంక్షేమ పథకాల అమలు
విద్యా, వైద్య శాఖల పని తీరు మెరుగయ్యేలా ప్రత్యేక కార్యాచరణ
నవగీతం,పెద్దపల్లి

ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పని తీరు ఉందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తో కలిసి పాల్గొని పోలీసు గౌరవం వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తన సందేశం ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, అర్హులైన నిరు పేద కుటుంబాలకు రేషన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నూతనంగా 24 వేల 603 రేషన్ కార్డులు జారీ చేయడం ద్వారా అదనంగా 86,734 మంది పేదలు రేషన్ ద్వారా సన్న బియ్యం పోందుతున్నారని, ఖరీఫ్ 2024-25 సీజన్ కు సిఎంఆర్ రైస్ డెలీవరి 100 శాతం పూర్తి చేసి పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగం ఆధునీకరించేందుకు ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునః ప్రారంభించి, జిల్లాలో 61 మంది రైతులను ఎంపిక చేసి 23 లక్షల 36 వేల రూపాయల సబ్సీడితో వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు.

46 వేల 507 మంది రైతుల నుండి 3 లక్షల 10 వేల 450 మెట్రిక్ టన్నుల సన్న వడ్లు కొనుగొలు చేసి 137 కోట్ల 81 లక్షల బోనస్ రైతుల ఖాతాలలో జమ చేశామని అన్నారు. జిల్లాలో కోటి 68 లక్షల రూపాయల సబ్సీడితో మరో 3180 ఎకరాలలో ఆయిల్ పామ్ పంట విస్తరించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిపి రాంరెడ్డి, అదనపు కలెక్టర్ లు జే.అరుణ శ్రీ, డి.వేణు, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, ప్రజా ప్రతినిధులు,జిల్లా అధికారులు, పోలీస్ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


