నవగీతం,మెట్ పల్లి:
కోరుట్ల పట్టణంలో ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్, బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ ని సిట్ విచారణకు పిలవడం అనేది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్య అని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన కేసీఆర్ ప్రజాదరణను తట్టుకోలేకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిరంకుశ, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు, నోటీసులతో భయబ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు.
ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరంతరం పోరాటం చేస్తాయని హెచ్చరించారు.. కేసీఆర్ పై జరుగుతున్న రాజకీయ వేధింపులను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరని, తగిన సమయంలో కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ఈ నిరసన ర్యాలీలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కోరుట్ల ,మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనను తెలిపారు.

