ప్రత్యేక కార్యచరణ ద్వారా త్రాగునీటి వ్యవస్థ బలోపేతం
పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్
నవగీతం,పెద్దపల్లి:

నిబంధనల ప్రకారం గ్రామాలలో ప్రభుత్వ పాలన జరగాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ పాలనపై పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, గ్రామాలకు ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిందని, వీటిని వినియోగించుకుంటూ గ్రామాలలో పారిశుధ్యం పనులు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో రోడ్ల పై ఎట్టి పరిస్థితుల్లో చెత్త, ప్లాస్టిక్ ఉండటానికి వీలు లేదని అన్నారు. ప్రతి గ్రామం ఎంట్రన్స్ లో చెత్త కనిపిస్తుందని, ఈ పరిస్థితిలో వెంటనే మార్పు రావాలని అన్నారు. మల్టీ పర్పస్ వర్కర్ల ను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ చెత్త సేకరణ జరగాలని, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ బయట ఎక్కడ చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని, సేగ్రిగేషన్ షెడ్ లను పూర్తి స్థాయిలో వినియోగించాలని అన్నారు.
గ్రామాలలో ఎక్కడ రోడ్ల పై నీరు నిల్వ ఉండడానికి వీలు లేదని, రోడ్డు పక్కన పిచ్చి మొక్కలు ఉంటే వెంటనే తొలగించాలని అన్నారు. రోడ్లపై చెత్త వేసే వారిపై జరిమానాలు విధించాలని, వేసిన జరిమానాలు వసూలు చేసేందుకు ప్రత్యేక కార్యచరణ అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుత సంవత్సరం జీరో డెంగ్యూ కేసులు లక్ష్యంగా గ్రామాలు పని చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యా సంస్థలకు ప్రతిరోజు పంచాయతీ సిబ్బంది వెళ్లి చెత్త సేకరించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామాలలో పూర్తిస్థాయిలో విద్యుత్ స్తంభాల వద్ద మూడవ వైర్ పనులు పూర్తి కావాలని, ఎక్కడ కూడా పగలు లైట్ వెలగడానికి వీలులేదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.గ్రామ పంచాయతీలలో భవన నిర్మాణాలు, లేఔట్ లకు అనుమతులు నిబంధనల ప్రకారం జారీ కావాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా నిర్మాణాలు చేపడితే వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎటువంటి ఒత్తిడులను పట్టించుకోవద్దని, నిబంధనలకు విరుద్ధంగా ఒక్క అనుమతి కూడా జారీ చేయడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. పంచాయతీ జారీ చేసిన అనుమతులకు అతిక్రమిస్తూ నిర్మాణాలు జరిగితే వెంటనే వాటిని తొలగించాలని అన్నారు. లేఔట్ అనుమతులను సకాలంలో డిస్పోజ్ చేయాలని, నిబంధనలు పాటించని పక్షంలో వెంటనే తిరస్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పంచాయతీ కార్యదర్శుల ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు సంబంధిత కార్యదర్శులు ఎదుర్కొంటారని కలెక్టర్ హెచ్చరించారు.రాబోయే వేసవి కాలంలో త్రాగునీటి ఇబ్బందులు రాకుండా మిషన్ భగీరథ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఫిబ్రవరి 1 నుంచి 20 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని అన్నారు. ఆపద సమయాల్లో మిషన్ భగీరథకు ప్రత్యామ్నాయంగా గ్రామాలలో అందుబాటులో ఉన్న బోర్ వెల్స్, మోటార్ల నుంచి త్రాగునీటి సరఫరాకు గల అవకాశాలు పరిశీలించాలని అన్నారు.మిషన్ భగీరథ త్రాగునీటి లీకేజీల ద్వారా వృథాగా రోడ్డుపై నీరు వెళ్తుంది అనే వార్తలు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, అంగన్వాడి లలో త్రాగునీటి నాణ్యతను వారానికి ఒకసారి పరిశీలించాలని, అవసరమైన చోట అందుబాటులో ఉన్న నిధులతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన కొంత మంది లబ్ధిదారులు పలు మార్లు ఫాలో అప్ చేసినప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభించడం లేదని, అలసత్వం చేస్తున్న లబ్ధిదారులు వెంటనే ఇండ్ల నిర్మాణం ప్రారంభించిన పక్షంలో రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పురోగతి ఆధారంగా వారికి బిల్లులు వచ్చే విధంగా ఎప్పటికప్పుడు వెంటనే ఆన్ లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఉపాధి హామీ పథకం క్రింద మంజూరు చేసిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేసేందుకు కార్యాచరణ అమలు చేయాలని అన్నారు.ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నరేందర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని , పీడీ హౌసింగ్ రాజేశ్వర్, ఎంపీడీవోలు ,డి. ఎల్.పి.ఓ. దేవకీ,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


