నవగీతం,పెద్దపల్లి:
విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న చైన్ మేన్ ఈ. రఘును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.మంథని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న రఘు,ఈ ఏడాది జనవరి13 నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరయ్యారు. గతంలోనూ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పలుమార్లు మెమోలు జారీ చేసినప్పటికీ, అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు.రఘు తీరుపై మంథని ఆర్డీఓ సమర్పించిన సమగ్ర నివేదిక ఆధారంగా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కమాన్‌పూర్ తహసీల్దార్ కార్యాలయంలో చైన్ మేన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రఘును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన కలెక్టర్, సస్పెన్షన్ కాలంలో అధికారుల అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వదిలి వెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

