యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ రీజనల్ ఏజీఎం శ్రీలత
నవగీతం,కొడిమ్యాల:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ నెల 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలలో భాగంగా సోమవారం కొడిమ్యాల మండలం గంగారాం తండా గ్రామంలో ప్రత్యేక అవగాహన శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ రీజనల్ ఏజీఎం శ్రీలత మాట్లాడుతూ… ఈ ఏడాది ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల ప్రధాన అంశం “కేవైసీ నవీకరణే సురక్షిత బ్యాంకింగ్‌కు తొలి అడుగు” అనే దానిపై కేంద్రీకృతమై ఉందని తెలిపారు.ప్రజల్లో సురక్షిత బ్యాంకింగ్ విధానాలపై అవగాహన పెంపొందించడం, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన కేవైసీ వివరాలను నవీకరించుకోవడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు పాటించడం, ఆర్థిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.ప్రతి ఖాతాదారుడు తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన కేవైసీ వివరాలను వెంటనే నవీకరించుకోవాలని కోరారు.

.కేవైసీ నవీకరణ ద్వారా బ్యాంకింగ్ సేవలు నిరంతరంగా అందుబాటులో ఉండటంతో పాటు, ఖాతాల దుర్వినియోగాన్ని నివారించవచ్చని తెలిపారు.అలాగే ఓటీపీలు, పిన్ నంబర్లు,పాస్‌వర్డులు వంటి గోప్యమైన బ్యాంకింగ్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని, అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ మాట్లాడుతూ, ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో గ్రామ సభలు,అవగాహన కార్యక్రమాలు,వినియోగదారుల సమావేశాలు,ఆర్థిక విద్యా శిబిరాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా సురక్షిత డిజిటల్ బ్యాంకింగ్, పొదుపు అలవాట్లు, బాధ్యతాయుత ఆర్థిక ప్రణాళిక, ప్రభుత్వ ఆర్థిక పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు.ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, తమ కేవైసీ వివరాలను నవీకరించుకొని, సురక్షిత బ్యాంకింగ్ విధానాలను అనుసరించాలని కోరారు. ఆర్థిక అవగాహన ప్రతి కుటుంబం మరియు సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కొడిమ్యాల శాఖ మేనేజర్ సంజీవ్ కుమార్, జిల్లా ఎఫ్‌ఎల్‌సీ కోట మధుసూదన్, ఫీల్డ్ ఆఫీసర్ గజానన్, ఏపీఎం మల్లేశం, ఎంఎస్ అధ్యక్షురాలు పద్మ, మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ సురేష్, సీసీలు మరియ, కమల, సర్పంచ్ వినోద్ నాయక్, కార్యదర్శి రమేష్, సీఫ్ఎల్ కౌన్సిలర్లు శంకర్, కృష్ణవేణి, నరేష్, మహిళా సంఘాల సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

