Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలప్రాణాలు పోయాయి… భరోసా ఎక్కడ.. ?

ప్రాణాలు పోయాయి… భరోసా ఎక్కడ.. ?

📰 Generate e-Paper Clip

పలకరింపు కూడా దొరకలేదా.. ?

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో ఈ నెల 3వ తేదీన జరిగిన భయానక ట్రాక్టర్ ప్రమాదంతో విషాదంలో మునిగిపోయింది. కూలి పనుల కోసం బయలుదేరిన అమాయకుల ప్రాణాలు క్షణాల్లో ఆగిపోవడంతో గ్రామం మొత్తం శోకసంద్రంగా మారింది కానీ ప్రభుత్వ భరోసా తో పాటు కనీసం నాయకుల పలకరింపు కూడా కరువైంది. ఈ ప్రమాదంలో 6వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక వైష్ణవితో పాటు మరో ముగ్గురు నిరుపేద మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోవడం గ్రామస్తుల హృదయాలను ఛిద్రముచేసింది. చిన్నారి కలలు చిద్రమైపోవడం, కుటుంబాల ఆర్తనాదాలు ఇంకా ఆగలేదు. ఇంటి ఆర్థిక భారం మోయాల్సిన మహిళలు ఒక్కసారిగా లేని పరిస్థితి రావడంతో ఆ కుటుంబాలు అంధకారంలోకి నెట్టబడ్డాయి. ఇంత పెద్ద విషాదం చోటుచేసుకున్నప్పటికీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు బాధిత కుటుంబాలను కనీసం పరామర్శించకపోవడం గ్రామస్థుల్లో తీవ్ర ఆవేదన రేకెత్తిస్తోంది. “ప్రభుత్వ భరోసా ఏమో కానీ, కనీసం ఓ పలకరింపు కూడా కరువైంది” అంటూ కుటుంబీకులు కన్నీటి గళంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం, పిల్లల విద్యకు పూర్తి భరోసా, మరియు కుటుంబాల పునరావాసం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. కనీసం ఇప్పుడు అయినా ప్రజాప్రతినిధులు స్పందించి, పరామర్శించి, ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పాలని గ్రామం మొత్తం ఆశగా ఎదురుచూస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular