ఆ వేషం చూసి అక్కడి నుంచి పరుగెత్తిన కోతులు
నవగీతం,మల్లాపూర్
జిల్లాలో కోతుల బెడద దాదాపు అన్ని గ్రామాల్లోను ఉంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ,వార్డు సభ్యుల ఎన్నికల సమయంలో కొన్ని గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు ముందుగానే బోనులు ఏర్పాటు చేసి కోతులను పట్టుకున్నారు. కోతుల బెడదను తప్పిస్తే ఓటు వేస్తామని చెప్పిన ఓటర్లు కూడా కొన్ని గ్రామాల్లో ఉన్నారు. అయితే జగిత్యాల జిల్లాలో వార్డు సభ్యురాలుగా గెలిచిన ఆమె భర్త తన వార్డులో కోతుల బెడదను తగ్గించేందుకు తానే ఎలుగుబంటి వేషం వేశాడు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో 14 వ వార్డు సభ్యురాలు ఏనుగు లక్ష్మి ఎన్నికయ్యారు. అయితే ఆమె భర్త తన వార్డులో కోతులను తరిమి కొట్టేందుకు ఎలుగుబంటి వేషం వేశాడు. ఆ వేషం చూసి కోతులు అక్కడి నుంచి పారిపోయాయి.

ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. గత రెండు మూడేళ్లుగా తమ గ్రామంలో కోతుల బెడద ఎక్కువైందని అన్నాడు. మా వార్డులో కోతులు కొంతమంది పై దాడి చేసిన సంఘటనలు జరిగాయని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గ్రామానికి ఈ బెడద తప్పించేందుకు ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో యూట్యూబ్‌లో చూడగా ఈ ఆలోచన వచ్చిందని అన్నాడు. ప్రభుత్వం కూడా అన్ని గ్రామాల్లో కోతుల బెడదను తప్పించాలని విజ్ఞప్తి చేశాడు.

