స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు
నవగీతం, కొడిమ్యాల:
కొడిమ్యాల మండలంలో మరోసారి పులి సంచారం కలకలం రేపుతోంది. దమ్మయ్యపేట గ్రామ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి ప్రత్యక్షమవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.స్థానికుల కథనాల ప్రకారం, గ్రామం సమీపంలోని పొలాలు మరియు చెరువుల వైపు పులి సంచరిస్తున్నట్లు గమనించారు.ఈ సమాచారం గ్రామంలో వేగంగా వ్యాపించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రజలు గుంపులుగా చేరి చర్చించుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

ఎస్‌ఆర్‌ఏ గులాం మొయినుద్దీన్, డిప్యూటీ రేంజర్ ముసిరుద్దీన్ సంఘటన ప్రదేశాన్ని పరిశీలించి గ్రామస్తులకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు. పశువులను బయట వదిలేయకుండా కట్టడి చేయాలని, రాత్రి వేళల్లో అత్యవసరం లేకుండా బయటకు రాకూడదని హెచ్చరించారు. పులి కనిపించిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.గ్రామ పరిసర ప్రాంతాల్లో గస్తీని పెంచినట్లు అధికారులు తెలిపారు. పులి కదలికలపై నిశితంగా నిఘా ఉంచుతున్నామని పేర్కొన్నారు.ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. అటవీ శాఖ చర్యలతో పరిస్థితి అదుపులోకి వస్తుందనే ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు.

