Monday, March 9, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలసైబర్ మోసలకు గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి

సైబర్ మోసలకు గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి

📰 Generate e-Paper Clip

సైబర్ క్రైమ్ డిఎస్పి వెంకటరమణ 

నర్సింగ్ విద్యార్థినులకు సైబర్ నేరాల నివారణ పై అవగాహన

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ మహిళా నర్సింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులకు సైబర్ భద్రతపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ..  మహిళలు, ముఖ్యంగా విద్యార్థినులు సోషల్ మీడియా వేదికల ద్వారా జరుగుతున్న వివిధ రకాల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

సైబర్ స్టాకింగ్, సైబర్ బుల్లీయింగ్ వంటి సమస్యలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయని, సోషల్ మీడియా లేదా మెసేజింగ్ యాప్స్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపడం, వేధించడం, బెదిరించడం వంటి చర్యలు సైబర్ నేరాల పరిధిలోకి వస్తాయని వివరించారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్‌ల ద్వారా జరుగుతున్న మోసాలపై కూడా అవగాహన కల్పించారు. ఇతరుల పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించి డబ్బులు అడగడం, వ్యక్తిగత వివరాలు సేకరించడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు.

అందువల్ల సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. విదేశాల్లో ఉద్యోగం, గిఫ్ట్ పంపిస్తున్నామని చెప్పి డబ్బులు అడిగే మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అదేవిధంగా ఫిషింగ్ లింకులు పంపించి డేటా దొంగిలించడం, ఓటీపీలు తీసుకోవడం వంటి సైబర్ మోసాల గురించి కూడా వివరించారు. సోషల్ మీడియా ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లు ఉపయోగించడం, ప్రైవసీ సెట్టింగ్స్‌ను సరిచేసుకోవడం, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకపోవడం వంటి భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైనప్పుడు వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని, అలాగే https://cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చని తెలిపారు. బాధితులు ఆలస్యం చేయకుండా వెంటనే సమాచారం అందిస్తే మోసపోయిన డబ్బులను తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. కార్యక్రమం అనంతరం విద్యార్థినులు అడిగిన వివిధ సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. సైబర్ నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ విద్యార్థినులతో సైబర్ క్రైమ్ అవగాహన ప్రతిజ్ఞ చేయించారు. సైబర్ భద్రతపై అవగాహన పెంచేందుకు పోస్టర్ ప్రెజెంటేషన్ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, సైబర్ క్రైమ్ ఎస్‌.ఐ లు కృష్ణ, దినేష్, టౌన్ ఎస్‌.ఐ సుప్రియా, కళాశాల సిబ్బంది, కళా బృంద సభ్యులు మరియు సుమారు 250 మంది నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular