నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల పట్టణానికి చెందిన నలుగురు గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షల విలువ గల ప్రొసీడింగ్ కాపీలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అందజేశారు. అదేవిధంగా జగిత్యాల పట్టణం, రూరల్, అర్బన్ మండలాలకు చెందిన 10 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన రూ.10 లక్షల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం అందించడం ఎంతో గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు. ఏడు గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు ఆరు నెలల లోపు దరఖాస్తు చేసుకుంటే రూ.5 లక్షల పరిహారం అందుతుందని తెలిపారు. గత దశాబ్ద కాలంగా గల్ఫ్ మరియు ఎన్‌ఆర్‌ఐ సంఘాలు ఎన్‌ఆర్‌ఐ పాలసీ కోసం అనేక మార్లు వినతిపత్రాలు సమర్పించాయని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి గల్ఫ్ కార్మికుల బాధలను అర్థం చేసుకుని పరిహారం అందజేయడం వల్ల వారి కుటుంబాలకు ఆర్థికంగా భరోసా లభిస్తోందన్నారు. అలాగే గతంలో అమలు చేసిన కళ్యాణ లక్ష్మీ పథకాన్ని కొనసాగిస్తూ పేద కుటుంబాల ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్మన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, ఎమ్మార్వో రామ్మోహన్, సీనియర్ నాయకులు బాలే శంకర్, మహేశ్వర్ రావు, బాల ముకుందం, గడ్డం నారాయణ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కట్ట రాజేందర్, సర్పంచులు గోడిసెల గంగాధర్, మహేష్, ప్రకాష్, జమున రాజేందర్, ములసపు మహేష్, సంగేపు మహేష్, ఆనంద్ రెడ్డి, కౌన్సిలర్లు పవిత్ర మహేష్, హరీష్, నాయకులు ఆరుముల్ల పవన్, రాజశేఖర్ రెడ్డి, మహేందర్, రాజేశ్వర్ రెడ్డి, శరత్ రావు, మల్లారెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

