నవగీతం,కొడిమ్యాల:
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం సూరంపేట గంగారం తండా పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. గత రెండు రోజులుగా పులి పశువులపై వరుస దాడులు జరుపుతుండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముందు రోజే ఒక లేగదూడను పులి చంపినట్లు స్థానికులు తెలిపారు. ఆ ఘటనలో బాధితుడికి అటవీ శాఖ అధికారులు తక్షణ సహాయంగా రూ.5,000 అందజేశారు. తదుపరి రోజు గంగారం తండాలోని సేవలాల్ గుడి సమీపంలో తేజావత్ గోరి అనే రైతుకు చెందిన సుడి ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. ఈ ఘటనలను సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా అటవీ అధికారులు నిర్ధారించారు.పులిని పట్టుకునేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. పులి మళ్లీ అదే ప్రాంతానికి వచ్చే అవకాశముందని భావించి మృత పశువు ఉన్న పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గంగారం తండా అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఈ పులిని అధికారులు “జె–వన్–1”గా గుర్తించారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుండి వలస వచ్చిన ఈ పులి, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల మీదుగా జగిత్యాల జిల్లాకు చేరుకున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. అటవీ ప్రాంతాలకు లేదా పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దని, కనీసం 5 నుంచి 10 మంది గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఉదయం 8 గంటల తర్వాత మాత్రమే పొలాలకు వెళ్లి, సాయంత్రం 5 గంటలలోపే తిరిగి రావాలని తెలిపారు. పశువుల కాపరులు కూడా గుంపులుగా మాత్రమే అడవికి వెళ్లాలని హెచ్చరించారు.పొలాల చుట్టూ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని, దీని వల్ల పులికి హాని కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పులి దాడిలో పశువులను కోల్పోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందజేస్తుందని హామీ ఇచ్చారు.పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా అటవీ శాఖాధికారి తెలిపారు.ప్రాంతంలో ఎక్కడైనా పులి కదలికలు గమనించిన వెంటనే సమీప అటవీ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

