వివరాలు వెల్లడించిన డిఎస్పి రాములు
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
కోరుట్ల పట్టణానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడైన భర్తను కోరుట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో మెట్ పల్లి డిఎస్పి రాములు మాట్లాడుతూ. మాధాపూర్ గ్రామానికి చెందిన గంధం దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన కుమార్తె చిత్తారి @ గంధం వైష్ణవి (20)ను ఆమె భర్త చిత్తారి హరిబాబు హత్య చేసినట్లు ఫిర్యాదు అందినట్టు తెలిపారు.డిఎస్పీ రాములు తెలిపిన వివరాల ప్రకారం వైష్ణవి యూట్యూబ్ ద్వారా వీడియోలు రూపొందిస్తూ ఉండేది. సుమారు 10 నెలల క్రితం హరిబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహం కోసం వచ్చాడు. కట్నం ఇవ్వలేమని స్పష్టంగా తెలిపినా, ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమ వివాహానికి దారితీసింది. అయితే హరిబాబు తల్లి లక్ష్మి కట్నం లేకుండా వివాహానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తెచ్చేందుకు హరిబాబు విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేసినట్లు పేర్కొన్నారు. చికిత్స అనంతరం కోలుకున్న అతడు మళ్లీ వివాహం కోసం ఒత్తిడి చేయగా, మొదట కుటుంబం నిరాకరించింది. ఈ క్రమంలో 29-05-2025 రోజున వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వివాహం వైష్ణవి హరిబాబు జరిగింది. అనంతరం వారు ఫిర్యాదుదారుడైన గంధం దుర్గ ప్రసాద్ ఇంటిలోనే వారు నివసించారు. కొంతకాలం తర్వాత హరిబాబు రూ.5 లక్షల కట్నం కోరగా, ఆ మొత్తాన్ని ఇచ్చి మాధాపూర్ గ్రామంలో రెండు గుంటల భూమి కొనుగోలు చేసి ఫిర్యాదుదారు ఇచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ మరో రూ.5 లక్షలు కోరుతూ వైష్ణవిని మానసిక, శారీరకంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అతని తల్లి లక్ష్మి, అన్నలు ఆనంద్,అశోక్ కూడా ప్రేరేపించినట్లు ఆరోపించారు. సుమారు మూడు నెలల క్రితం వైష్ణవి గర్భవతిగా ఉన్ననాటి నుండి ఎక్కువగా వేధింపులు కొనసాగినట్లు వెల్లడించారు. మార్చి 16 రాత్రి 11 గంటల సమయంలో వైష్ణవి, హరిబాబు గదిలో నిద్రకు వెళ్లగా, తెల్లవారుజామున 4 గంటల సమయంలో శబ్దాలు వినిపించాయని, తలుపు తట్టినా తీయకపోవడంతో తిరిగి వెళ్లిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం హరిబాబు తన భార్యను నిద్రలో ఉండగానే కత్తితో దాడి చేసి, గొంతు నులిమి హత్య చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్చి 17 ఉదయం 6 గంటల సమయంలో హరిబాబు ఒంటరిగా బయటకు వచ్చి, ముఖం కడిగి తన బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ (TG-21-A-8026)పై ఎవరికి తెలియకుండా వెళ్లిపోయాడు. తర్వాత గది తలుపు తెరిచి చూడగా వైష్ణవి రక్తపు మడుగులో పడివుండగా, నుదిటిపై గాయాలు, మెడపై గుర్తులు కనిపించాయి. వెంటనే ఆమెను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, కోరుట్లకు తరలించగా, వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు ప్రకటించారు. హత్య అనంతరం హరిబాబు రాయికల్–మైతాపూర్ ప్రాంతాల్లో తిరుగుతూ, కొనరావుపేట ఎక్స్ రోడ్ సమీపంలోని ఖాళీ డబుల్ బెడ్‌రూమ్ ఇంటి మెట్ల కింద కత్తి, రక్తపు మచ్చలున్న దుస్తులను దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి ఒప్పంద ప్రకటన ఆధారంగా పంచుల సమక్షంలో రికవరీ పంచనామా నిర్వహించి, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్, రక్తపు మచ్చలున్న కత్తి, నీలం రంగు జీన్స్ ప్యాంట్, నీలం రంగు టీ-షర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్‌డీపీఓ మెట్ పల్లి ఏ. రాములు, కోరుట్ల సిఐ బి సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి తెలిపారు.

