చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున స్వర్గస్తులైన జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చరిత్రకారులు జైశెట్టి రమణయ్య పార్థివ దేహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పోతరవేణి తిరుపతి మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్ర పితామహునిగా ప్రసిద్ధిచెందిన జైశెట్టి రమణయ్య మరణం తెలంగాణ చరిత్రకు, ఈ ప్రాంత చరిత్రకారులకు తీరనిలోటు అని అన్నారు.తెలంగాణ చరిత్రకు ఆయన చేసిన సేవలను అమోఘమని, జగిత్యాల పట్టణంలోనే మొదటి ఏం.ఏ పట్టభద్రుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సోషల్ సైన్సెస్ లో మొదటి డాక్టరెట్ పట్టభద్రుడుగా అయన మాకు ఆదర్శనీయులు. వారు రాసిన చాళుక్య- కాకతీయ దేవాలయాల చరిత్ర, దక్షిణ భారత దేవాలయాల చరిత్ర అనే గ్రంధాలు దక్కన్ వాస్తు శిల్పకళా రీతులను తెలుసుకోవడానికి గొప్ప ప్రామాణికం అన్నారు. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్ర సంస్కృతి గ్రంధం మొత్తం తెలంగాణ జిల్లా చరిత్ర రచనలకే మార్గదర్శనం. జగిత్యాల జిల్లా చరిత్ర సంస్కృతి, తెలంగాణలో ప్రముఖ దేవాలయాలు,కోటలు అనే గ్రంధాలు నేటి చరిత్ర పరిశోధకులకు ఎంతో ఉపయుక్తం అని పేర్కొన్నారు.ఇక అన్నింటి కంటే ముఖ్యంగా ఆయన చరిత్రకారుడిగా నిత్యజీవితంలోని, సమకాలీన సంఘటనలను డైరీ రూపంలో రాయడం చరిత్రలోనే ఒక నూతన ఒరవడి. దాదాపు 58 ఏళ్ళ చరిత్రను డైరీ రూపంలో రాయడం ఆయనకే చెల్లిందన్నారు.రమణయ్య జీవితాంతం చరిత్ర బోధన, పరిశోధన, రచనల పట్ల ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత ఈ ప్రాంత చరిత్రను ఇక్కడి ప్రతి విద్యార్థికి బోధించాలని అందుకై ఇంటర్మీడియట్ స్థాయి నుంచి డిగ్రీ వరకు అన్ని కోర్సుల్లో చరిత్రను తప్పనిసరి సబ్జెక్టు చేయాలని కలలుగన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సుదర్శన్, నరేష్, నిర్మల, రజిత తదితరులు పాల్గొన్నారు.


