నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:
హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని మెట్‌పల్లి అభయహస్త హనుమాన్ ఆలయం నుండి ముగ్గురు భక్తులు చేపట్టిన కొండగట్టు పాదయాత్ర భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిసింది. మాదస్తు శంకర్, పోతుగంటి నాగరాజ్, కొత్తపల్లి రవి గురువారం సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్రను ప్రారంభించి, శుక్రవారం మధ్యాహ్నానికి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అంజన్నను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోతుగంటి నాగరాజ్ 20వ సారి, మాదస్తు శంకర్ 14వ సారి, కొత్తపల్లి రవి మొదటిసారి పాదయాత్రను పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ విధంగా పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేయాలంటే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు, కృపా కటాక్షం అవసరమని పేర్కొన్నారు. మండుటెండను తట్టుకుని భక్తి భావంతో పాదయాత్రను పూర్తి చేసిన వీరిని మిత్రులు, ఆప్తులు, శ్రేయోభిలాషులు అభినందిస్తూ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.

