ఘనంగా సన్మానించిన ప్రజాప్రతినిధులు
నవగీతం,మెట్‌పల్లి ప్రతినిధి :
మెట్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవల వెల్లడైన ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి కళాశాల కీర్తిని చాటిన విద్యార్థులను కళాశాల ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, కళాశాల ప్రిన్సిపల్ సంగెం దేవారం విద్యార్థులకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన బోధన అందుతుందని, క్రమశిక్షణతో చదివి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పేదరికంలో ఉండి కూడా పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు ఇతరులకు ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్ స్థానిక కౌన్సిలర్లు, కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

