Monday, November 2, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఅనాథ వ్యక్తికి అన్ని తానై అంత్యక్రియలు నిర్వహించిన రాజేశుని శ్రీనివాస్

అనాథ వ్యక్తికి అన్ని తానై అంత్యక్రియలు నిర్వహించిన రాజేశుని శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.. అనాథలకు అండగా శివ గాయత్రి అనాథ వృద్ధాశ్రమం

జగిత్యాల, అక్టోబర్ 21 (నవగీతం):

మానవత్వమే మహోన్నతమైన సేవ అని చాటుతూ, ఎలాంటి రక్తసంబంధం లేకపోయినా అనాథ వ్యక్తికి అన్ని తానై అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు జగిత్యాలలోని రాజేశుని గుట్ట వద్ద ఉన్న శివ గాయత్రి అనాథ వృద్ధాశ్రమం అధ్యక్షుడు రాజేశుని శ్రీనివాస్. సమాజసేవలో భాగంగా ఆయన చూపిన సేవాభావాన్ని ఆశ్రమ నిర్వాహకులు, వృద్ధులు అభినందించారు.

వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస్ అనే వ్యక్తి సుమారు తొమ్మిది నెలల క్రితం మతిస్థిమితం లేక రోడ్లపై తిరుగుతుండగా ఇద్దరు వ్యక్తులు గమనించారు. అతడిని జగిత్యాలలోని రాజేశుని గుట్ట వద్ద ఉన్న శివ గాయత్రి అనాథ వృద్ధాశ్రమంలో చేర్పించారు. అప్పటి నుంచి ఆశ్రమంలో ఉంటున్న ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు కనిపించినప్పటికీ, బుధవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు.

తనకు ఆరోగ్యం బాగాలేదని, చలిగా ఉందని చెప్పి టీ తాగిన అనంతరం బెడ్‌షీట్‌ కప్పుకొని విశ్రాంతి తీసుకుంటానని పడుకున్నారు. అయితే, ఆశ్రమంలో మేనేజర్‌గా పనిచేస్తున్న మోటూరి నాగలింగం ఆర్ఎంపీ వైద్యుడిని తీసుకొచ్చి చూపించగా, అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు. వెంటనే ఆశ్రమ నిర్వాహకులకు సమాచారం అందించారు.

దీంతో ఆశ్రమ అధ్యక్షుడు రాజేశుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేసి, చింతకుంట సమీపంలోని శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం మృతుడి అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ ప్రధాన కార్యదర్శి రంగు రాజయ్య, కోశాధికారి కప్పల చంద్రమౌళి, ఆశ్రమ నిర్వాహకులు, మేనేజర్ మోటూరి నాగలింగంతో పాటు ఆశ్రమంలోని వృద్ధులు పాల్గొన్నారు.

అనుబంధాలకు అతీతంగా మానవత్వపు సేవ

ఎలాంటి రక్తసంబంధం లేకపోయినా, తన పేరుతో ఉన్న అనుబంధాన్ని మానవత్వంగా మార్చుకొని అనాథ వ్యక్తి అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించిన రాజేశుని శ్రీనివాస్ సేవలను ఆశ్రమ నిర్వాహకులు, వృద్ధులు కొనియాడారు. సమాజసేవ అంటే కేవలం సహాయం చేయడమే కాకుండా, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, మరణానంతరం కూడా గౌరవప్రదమైన వీడ్కోలు అందించడం అని ఆయన నిరూపించారని ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఆశ్రమ అధ్యక్షుడు రాజేశుని శ్రీనివాస్ మాట్లాడుతూ, సమాజంలో ఎవరైనా అనాథ వృద్ధులు ఉన్నట్లయితే తమ ఆశ్రమంలో చేర్చుకొని వారికి ఆశ్రయం కల్పిస్తామని తెలిపారు.

అంతేకాకుండా, పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, తమ పెద్దల జయంతి, వర్ధంతి వంటి సందర్భాలను ఆశ్రమంలోని వృద్ధుల సమక్షంలో జరుపుకోవాలని సూచించారు. ఆయా సందర్భాల్లో వృద్ధులకు భోజన సదుపాయం కల్పించి, వారి మధ్య వేడుకలు నిర్వహించుకోవడం ద్వారా తమ పెద్దల సమక్షంలో వేడుకలు జరుపుకున్న అనుభూతిని పొందవచ్చని తెలిపారు.

అనాథలకు ఆశ్రయం కల్పిస్తూ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న శివ గాయత్రి అనాథ వృద్ధాశ్రమం సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular