చొప్పదండి, అక్టోబర్ 1 (నవగీతం): భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న శుక్రవారం చొప్పదండి మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించనున్న గ్రామ సభల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, పేపర్ ప్లేట్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించేలా తీర్మానాలు చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, చొప్పదండి సింగిల్ విండో చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గ్రామ సభల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ తీర్మానాలు చేసి, వాటిని కట్టుదిట్టంగా అమలు చేయడం ద్వారా చొప్పదండి మండలంలోని అన్ని గ్రామాలు ఆదర్శంగా నిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

