అడవి దారిలో అడుగులు.. ప్రకృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
రుద్రంగి,అక్టోబర్28,(నవగీతం)
రుద్రంగి మండల కేంద్రంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో స్వయంగా బైక్ నడుపుతూ, అడవి బాట పట్టిన రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అటవీ ప్రాంతంలోని సహజ నీటి వనరులను పరిశీలించారు.
రుద్రంగి అటవీ ప్రాంతంలోని సీమర్ల ఓర్రే వద్ద ఉన్న చెక్‌డ్యామ్‌లు, గోలేపు లొద్ది నుంచి నాగారం చేరువ ఓర్రే, సూరమ్మ బుగ్గ, రెండు గట్ల వాగు, బుగ్గ రాజరాజేశ్వర చెక్‌డ్యామ్‌లను స్వయంగా సందర్శించి వాటి పరిస్థితిని సమీక్షించారు.

అడవుల్లో సహజంగా ప్రవహించే వాగులు, వంకలు, నీటి బుగ్గలు ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన సంపద. వీటిని సంరక్షించడం ద్వారా అటవీ జీవజాలానికి నీటి లభ్యత పెరగడమే కాకుండా, భూగర్భ జలాల పరిరక్షణకు కూడా తోడ్పాటు అందుతుంది. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతంలోని నీటి వనరుల స్థితిగతులను పరిశీలించిన ఆది శ్రీనివాస్.. వాటి సంరక్షణ, అవసరమైన అభివృద్ధి పనులపై అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
ప్రకృతిని కాపాడుతూ.. నీటి వనరులను బలోపేతం చేస్తూ.. భవిష్యత్ తరాలకు పచ్చని అడవులను, సమృద్ధిగా నీటి వనరులను అందించాలనే లక్ష్యంతో ఆది శ్రీనివాస్ క్షేత్రస్థాయి పర్యటన సాగింది.


