ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు వెలకట్టలేనివి
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, అక్టోబర్21,(నవగీతం)
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు.విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవము సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, ప్రజలకు భద్రత కల్పించడం, సమాజంలో శాంతిభద్రతలను కాపాడటం, విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లు ఎదురైనా, కుటుంబాలకు దూరంగా ఉంటూ నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యే పోలీసు అధికారులు, సిబ్బంది సేవలు అభినందనీయమని తెలిపారు. సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసు శాఖ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పోలీసు శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అమరవీరుల కుటుంబాలకు సమాజం ఎల్లప్పుడూ అండగా నిలవాలని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ
దేశ రక్షణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వహిస్తూ ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. విధి నిర్వహణలో ధైర్యం, క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతతో పనిచేయడం ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది కర్తవ్యమని తెలిపారు.
ప్రజల ఆస్తులు, ప్రాణాలను రక్షించడం, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడం, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యతలని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా పోలీసు శాఖను సంప్రదించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సత్వర న్యాయం, సహాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ పారదర్శకంగా సేవలు అందించాలని ఎస్పీ సూచించారు. పోలీసు శాఖపై ప్రజలకు నమ్మకం మరింత పెరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని కోరారు.
పోలీసు అమరవీరుల ఆశయాలు, త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని, వారి సేవలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ప్రజల రక్షణ కోసం అంకితభావంతో పనిచేయడమే వారికి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమము అనంతరం పోలీసు కుటుంబ సభ్యులకు బహుమతులు అందచేశారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది మరియు అమర వీర పోలీస్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


