Monday, November 2, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలప్రజా సేవలో నిజాయితీ, పారదర్శకత ప్రతి ఉద్యోగి బాధ్యత

ప్రజా సేవలో నిజాయితీ, పారదర్శకత ప్రతి ఉద్యోగి బాధ్యత

📰 Generate e-Paper Clip

జగిత్యాల కలెక్టరేట్‌లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల కార్యక్రమం

జగిత్యాల, అక్టోబర్29,(నవగీతం)

విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అవగాహన సమావేశం, సమగ్రత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీమతి ప్రసూనాంబ, అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజాసేవలో నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనం, ప్రాధాన్యతను వివరించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ అవసరాల కోసం వచ్చే ప్రజలకు నిబంధనల మేరకు సకాలంలో సేవలందించాలని, విధుల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి అధికారి, ఉద్యోగి బాధ్యతతో పనిచేయాలని పేర్కొన్నారు.

అవినీతి నివారణ కేవలం ఒక శాఖ బాధ్యత మాత్రమే కాదని, అధికారులు, ఉద్యోగులు, ప్రజల సమష్టి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని వివరించారు. కార్యాలయాల్లో పారదర్శక విధానాలను పాటించడం, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా అందించడం, దరఖాస్తులను అనవసరంగా పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించడం ద్వారా మెరుగైన పాలన అందించవచ్చని తెలిపారు.

అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ మహేందర్ రెడ్డి, సీఐ ప్రేమ్ అవినీతి నివారణ, ఉద్యోగుల నైతిక బాధ్యతలు, విధుల నిర్వహణలో పాటించాల్సిన విలువలపై అవగాహన కల్పించారు. ఎలాంటి ప్రలోభాలకు తావివ్వకుండా చట్టానికి లోబడి విధులు నిర్వర్తించాలని సూచించారు.

అనంతరం అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమగ్రత ప్రతిజ్ఞ చేశారు. నిజాయితీతో విధులు నిర్వహిస్తూ, అవినీతిని నిరోధించేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రతినబూనారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular