ఎల్-నినో ప్రభావం, ప్రస్తుత పంటల సంరక్షణ పై ముఖ్య మంత్రి మార్గదర్శనం
యాసంగి సాగు ప్రణాళిక పై రైతులతో ముఖాముఖి
జగిత్యాల,అక్టోబర్11,(నవగీతం)
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం, అక్టోబర్ 12న ఉదయం 11:30 గంటల నుంచి రైతులతో నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లాలోని రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
ఎల్-నినో ప్రభావం, ప్రస్తుతం సాగులో ఉన్న పంటల సంరక్షణ, రాబోయే యాసంగి సీజన్లో పంటల సాగు ప్రణాళికతో పాటు వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ సంబంధిత అంశాలపై మార్గదర్శనం చేయడంతో పాటు, వారితో ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించనున్నట్లు పేర్కొన్నారు.జిల్లాలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కలిగిన అన్ని రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
జిల్లాలోని మండల అధికారులు, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన రైతు వేదికల్లో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌కు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.
సంబంధిత అధికారులు ముందుగానే రైతు వేదికలకు చేరుకుని, కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. రైతులకు ముందస్తుగా సమాచారం అందించి, వారు అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు, యాసంగి పంటల సాగు ప్రణాళికపై మార్గదర్శనం అందనున్న నేపథ్యంలో రైతుల భాగస్వామ్యం కీలకమని జిల్లా కలెక్టర్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

