ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ రేగొండ రాజేష్
నవగీతం, కోరుట్ల ప్రతినిధి:
భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని కొరుట్ల విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ రేగొండ రాజేష్ సూచించారు. వడదెబ్బ అనేది ప్రాణాపాయ స్థితి అని, దీని పట్ల నిర్లక్ష్యం వహిస్తే శరీరంలోని ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
వడదెబ్బ అంటే ఏమిటి ?
శరీర ఉష్ణోగ్రత 104°ఎఫ్ (40°సి) దాటినప్పుడు దానిని వడదెబ్బగా పరిగణించాలి.ఈ స్థితిలో మెదడు, గుండె, కిడ్నీలు మరియు ఊపిరితిత్తుల పనితీరు మందగించి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
గుర్తించాల్సిన లక్షణాలు:
తీవ్రమైన తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం.గుండె దడ పెరగడం (నాడి వేగంగా కొట్టుకోవడం).అధిక నీరసం, బీపీ ఒక్కసారిగా తగ్గిపోవడం.తీవ్ర స్థితిలో ఉన్న రోగి అయోమయానికి గురవ్వడం, ఫిట్స్ రావడం లేదా స్పృహ కోల్పోవడం జరుగుతుంది.
నివారణ చర్యలు – జాగ్రత్తలు:
వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరి అని డాక్టర్ రాజేష్ వివరించారు. మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు, ముఖ్యంగా లైట్ కలర్ బట్టలు ధరించాలి. ఎండలోకి వెళ్లేటప్పుడు గొడుగు వాడటం శ్రేయస్కరం.
పానీయాలు:
శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండటానికి ORS నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరకు రసం ఎక్కువగా తీసుకోవాలి.కూల్ డ్రింక్స్ (కార్బోనేటెడ్ డ్రింక్స్) అస్సలు తాగకూడదు, అవి విషంతో సమానం. అలాగే స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ మరియు నిల్వ ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి.
రైతులకు ప్రత్యేక సూచనలు:
రైతులు దైవంతో సమానం వాళ్ళు బాగుంటేనే మనమందరము బాగుంటాం.రైతులు తమ వ్యవసాయ పనులను ఉదయం 11 గంటల లోపు లేదా సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే చేసుకోవాలి. పనులకు వెళ్లే సమయంలో తమ వెంట తప్పనిసరిగా ఓ ఆర్ ఎస్ కలిపిన వాటర్ బాటిల్స్ ఉంచుకోవాలని డాక్టర్ సూచించారు.
ప్రథమ చికిత్స:
ఎవరైనా వడదెబ్బకు గురైనట్లు గమనిస్తే వెంటనే వారిని నీడలోకి చేర్చి, గాలి తగిలేలా చూడాలి. టైట్ గా ఉన్న బట్టలను వదులు చేసి, చల్లటి నీళ్లతో లేదా ఐస్ ముక్కలతో శరీరాన్ని తుడవాలి.ఆలస్యం చేయకుండా అరగంటలోపు సమీప వైద్యుడిని సంప్రదించి ఐవి ఫ్లూయిడ్స్ అందేలా చూడాలని ఆయన కోరారు.


