ఇబ్బందులు పడుతున్న రైతన్నలు
నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
కొడిమ్యాల మండలంలోని పూడూరు పాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్రానికి సరఫరా చేసిన గోనె సంచులు పాతవి, చినిగిపోయినవి, చిల్లులు పడినవిగా ఉండటంతో వాటిలో 40 కిలోల వరి ధాన్యం కూడా పూర్తిగా పట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ హమాలీలు సంచుల్లో 40 కిలోల ధాన్యం ఉన్నా లేకున్నా వాటిని కుట్టి లారీలలో లోడ్ చేసి రైస్ మిల్లులకు తరలిస్తున్నారని సమాచారం. దీంతో మిల్లులకు చేరిన తర్వాత తరుగు ఎక్కువగా వస్తోందని పేర్కొంటూ మిల్లు యాజమాన్యాలు ప్రతి సంచిపై అదనంగా మరో 3 కిలోల కోత విధిస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా రైతులు నష్టపోతుండటంతో వెంటనే 41.600 కిలోల వరి ధాన్యం పట్టే కొత్త గోనె సంచులను సరఫరా చేసి ఇలాంటి దోపిడిని అరికట్టాలని మాజీ వ్యవసాయ వర్సిటీ సభ్యులు వెలుముల రాంరెడ్డితో పాటు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


