ప్రభుత్వ ఆసుపత్రి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి
నవగీతం, జగిత్యాల/ధర్మపురి:
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశానుసారం ప్రజల ఆరోగ్య సౌకర్యార్థం ధర్మపురి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారంధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి స్వయంగా సందర్శించి ఆసుపత్రి పనితీరును పరిశీలించారు.వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆసుపత్రిలోని ప్రయోగశాలలు (ల్యాబ్‌లు), వైద్యుల హాజరు, వైద్య పరికరాలు, మందుల నిల్వలు, ఆసుపత్రి సిబ్బంది పనితీరు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకొని అవసరమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ, వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సరైన వైద్యం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వైద్య సేవలకు అవసరమైన అన్ని విధాల సహకారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి వైద్య సేవలను వినియోగించుకోవాలని ఆమె కోరారు.ఈ తనిఖీ కార్యక్రమంలో వైస్ ఛైర్మెన్ ఇందారపు రామన్న , కౌన్సిలర్లు సంగనబట్ల సంతోషిని ,చిపిరిశెట్టి రాజేష్ , సంగి ఆనంద్ ,కొమురవెల్లి పవన్ ,జంజీరికాని సువర్ణ ,మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎస్ కే షౌకత్, సుల్తానా, అశెట్టి మమత,ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


