ఎన్నారైలకు సామాజిక భద్రత, స్వావలంబన కల్పించే విధానాల రూపకల్పనపై చర్చ
విజయవాడ, అక్టోబర్ 21 (నవగీతం):
గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు ఎన్నారైల అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) కీలక ఆలోచనలతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని తాడేపల్లిలో ఉన్న ఏపీఎన్ఆర్టీ కార్యాలయంలో సంస్థ చైర్మన్ వేమూరి రవి, డైరెక్టర్ నాగేంద్రబాబును ఏపీఎన్ఆర్టీ గల్ఫ్ రీజినల్ కోఆర్డినేటర్ ఎం. వాసుదేవరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైల సమస్యలు, అవసరాలు, సంక్షేమం, అభివృద్ధి అవకాశాలు, భవిష్యత్తు భద్రతకు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సమావేశం అనంతరం వాసుదేవరావు మాట్లాడుతూ.. ఎన్నారైల అభ్యున్నతి కోసం ఏపీఎన్ఆర్టీ చైర్మన్ వేమూరి రవి చేస్తున్న ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలు ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నారైల సమస్యలు, అవసరాలను తెలుసుకోవడంతోపాటు, వారి అభివృద్ధికి అవసరమైన అవకాశాలపై విలువైన సమయాన్ని కేటాయించి చర్చించిన చైర్మన్ వేమూరి రవి, డైరెక్టర్ నాగేంద్రబాబుకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
సేవా కార్యక్రమాలకే పరిమితం కాకుండా ఆర్థిక భరోసా దిశగా అడుగులు
ఏపీఎన్ఆర్టీ కేవలం సేవా కార్యక్రమాలకే పరిమితం కాకుండా, గల్ఫ్ ఎన్నారైలకు ఆర్థిక భరోసా, సామాజిక భద్రత, స్వావలంబన కల్పించే దిశగా మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని వాసుదేవరావు అభిప్రాయపడ్డారు. ఎన్నారైల భవిష్యత్తుకు ఉపయోగపడే విధానాలను రూపొందించడంతోపాటు, రాబోయే రోజుల్లో వారికి ప్రయోజనం చేకూర్చే మరిన్ని విధానాలను ప్రవేశపెట్టాలనే ఆలోచన సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.
గల్ఫ్ దేశాల్లో కష్టపడి పనిచేస్తున్న ప్రతి తెలుగు కుటుంబానికి భద్రత, ఆర్థిక భరోసా, అభివృద్ధి అవకాశాలు అందుబాటులోకి రావాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. విదేశాల్లో ఉపాధి పొందుతున్న తెలుగు ప్రజల సంక్షేమంతోపాటు, వారి కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కల్పించే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
సంక్షేమం నుంచి సాధికారత వైపు..
ఎన్నారైల సంక్షేమం, ఆర్థిక భద్రత, స్వావలంబనకు దోహదపడే విధానాల రూపకల్పన ద్వారా వారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావచ్చని వాసుదేవరావు ఆశాభావం వ్యక్తం చేశారు.
“సేవ నుంచి సాధికారత వైపు.. సంక్షేమం నుంచి ఆర్థిక భరోసా వైపు.. ఏపీఎన్ఆర్టీ ప్రయాణం ఎన్నారైల జీవితాల్లో సానుకూల మార్పులకు నాంది కావాలి. గల్ఫ్‌లో పనిచేస్తున్న ప్రతి తెలుగు కుటుంబానికి భద్రతతో కూడిన భవిష్యత్తు అందుబాటులోకి రావాలి” అని ఆయన ఆకాంక్షించారు.

