నవగీతం, జగిత్యాల
జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ ప్రాంతంలో ఉన్న శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణ సీఐ కరుణాకర్ మాట్లాడుతూ, రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా సీట్‌బెల్ట్, హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అతివేగం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని స్పష్టం చేశారు.ట్రాఫిక్ ఎస్‌ఐ మల్లేశం మాట్లాడుతూ, విద్యార్థులు చిన్నతనంలోనే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారని అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ అర్థం, వాటి ప్రాముఖ్యతను వివరించారు. రాబోయే రోజుల్లో సమాజానికి ఆదర్శంగా నిలిచేలా ప్రవర్తించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ జ్యోతి, ఉపాధ్యాయులు ఫిరోజ్, జానకిరామ్‌తో పాటు పలువురు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.రోడ్డు భద్రతపై ఇలాంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.

