నవగీతం,జగిత్యాల
రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజలలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో “Arrive Alive” కార్యక్రమాన్ని ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రజలందరికీ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం, అధిక వేగం వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఎస్పీ కార్యాలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించగా, అందులో గెలుపొందిన వారికి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మరియు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. “Arrive Alive” కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు.

