నవగీతం, వైరా:
వైరా మండల కేంద్రంలోని వైరా సిపిఎం కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో ప్రతి నెల మూడవ ఆదివారం బోడేపూడి కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోడేపూడి వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆదివారం బోడేపూడి వైద్య శిబిరం ద్వారా షుగర్, బిపి, కొలెస్ట్రాల్, గ్యాస్, అల్సర్ తదితర వ్యాధులతో బాధపడుతున్న 425 మంది పేద, మద్యతరగతి ప్రజలకు డాక్టర్ చీకటి భార్గవి, డాక్టర్ జట్ల రంగారావు, డాక్టర్ పిల్లలమర్రి సుబ్బారావు ఉచితంగా వైద్య సేవలు అందించారు. బోడేపూడి వైద్య శిబిరం ద్వారా నెల రోజులకు సరిపడా మందులను కేవలం100 రూపాయలకే అందిస్తున్నారు. బోడేపూడి వైద్య శిబిరంపై పూర్తి నమ్మకంతో వేలాది మంది ప్రజలు గత పది సంవత్సరాల క్రితం నుంచి ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నారు. ఈ సందర్భంగా బోడేపూడి కళానిలయం కార్యదర్శి బొంతు రాంబాబు, ప్రముఖ వైద్యులు డాక్టర్ చీకటి భార్గవి మాట్లాడుతూ ఆహార అలవాట్లు, నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. శరీర బరువును నియంత్రించుకోవాలని, చక్కెర, స్వీట్లు, కూల్ డ్రింక్స్ మొదలైన వాటిని పూర్తిగా మానేయాలని తెలిపారు. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు ఎక్కువగా తినాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. శీతాకాలంలో చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా షుగర్ పేషంట్స్ గుండె సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోడేపూడి వైద్య శిబిరం బాధ్యులు సుంకర సుధాకర్, వాలంటీర్లు గుడిమెట్ల రజిత గుడిమెట్ల మోహన్ రావు, బొంతు సమత, మాదినేని రజిని, అనుమోలు రామారావు, మల్లెంపాటి ప్రసాదరావు, తోట నాగేశ్వరరావు, హరి వేంకటేశ్వరరావు, అమరనేని కృష్ణ, కంభంపాటి సత్యనారాయణ, ఐలూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు

