నవగీతం,జగిత్యాల
నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నూకపల్లి న్యాక్ సెంటర్ లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా బుధవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ నెల 19 నుండి 23 వరకు నూతనంగా ఎన్నికైన సర్పంచులకు మొదటి విడుత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఇక్కడికి ఆహ్వానించినందుకు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ కి అభినందనలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు పెట్టుకొని, ఎదురైన ఇబ్బందులను తట్టుకొని ప్రజల చేత ఎన్నికైన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, గుర్తించిన సమస్యలను వేగవంతంగా పరిష్కరించే విధంగా పట్టుదలతో ముందుకు వెళ్లాలని సూచించారు. మనం శాశ్వతం కాదు, మన పదవులు శాశ్వతం కాదు, కానీ మనం చేసే పనులు ఎప్పటికీ శాశ్వతం అని ప్రజలకు ఎల్లప్పుడూ గుర్తు ఉంటాయని తెలిపారు. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు చేరుతాయని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు, పన్నులు ముఖ్యంగా గ్రామాలను అభివృద్ధి పరచాలంటే పాలనాపరంగా ఏం కావాలో ఈ శిక్షణ కార్యక్రమంలో తెలుసుకోవచ్చని అన్నారు. మన గ్రామాన్ని అభివృద్ది చేసుకుంటే మన తల్లికి సేవ చేసినట్లే, మన గ్రామానికి మంచి పని చేస్తే గ్రామ ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. సర్పంచులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరూ సుపరిపాలన అందించి గ్రామాలను అభివృద్ధి పరుస్తూ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కోరారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం లో వచ్చిన మార్పులను కూడా సర్పంచ్ లు గమనించాలని, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటూ పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. గ్రామాల్లో సర్పంచులు పంచాయతీ కార్యదర్శులను అలాగే ఇతర అధికారులను సమన్వయం చేసుకొని సుపరిపాలన అందించాలని, ఆయా గ్రామాలని ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

