నవగీతం, మెట్ పల్లి రూరల్:
జగిత్యాల జిల్లా మెట్ పెల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని ఆయన సమీక్షించి, లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణానికి ఉపయోగిస్తున్న ఇటుకలు, ఇసుక, సిమెంట్ వంటి సామగ్రి ధరలు మరియు వాటి నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనులు నిర్వహించాలని సూచించారు. నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా వేగవంతంగా పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తే ప్రభుత్వ నిధులు కూడా త్వరగా విడుదల అవుతాయని, అందువల్ల లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అధికారులు కూడా పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సహకారం అందించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ప్రసాద్, ఎంపీడీఓ సురేష్, యంపీఓ మహేశ్వర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గురుడు తిరుపతి, పంచాయతీ కార్యదర్శి నారాయణ, హౌసింగ్ ఏ ఈ శరత్ తదితరులు పాల్గొన్నారు.
