నవగీతం, హైదరాబాద్:
హైదరాబాద్ నగరంలో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వ అనుమతి తీసుకొచ్చేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి వివాదాలు లేని అనుకూల ప్రదేశాన్ని గుర్తించి క్రిస్టియన్ భవన్ నిర్మాణం చేపట్టేలా ప్రయత్నాలు చేస్తానన్నారు.సోమవారం మెట్టుగూడలో గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డ్ కార్యాలయాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డ్ స్థాపన ఒక మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు.

క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ బోర్డ్ సమర్థవంతంగా పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పేద మరియు అవసరమైన క్రైస్తవులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ బోర్డ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా క్రైస్తవులకు లీగల్ పరంగా అవసరమైన సహాయం అందించడంలో ఈ లా బోర్డ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.క్రైస్తవ మైనారిటీ సంక్షేమంలో మహిళల అభివృద్ధి కూడా ఎంతో ముఖ్యమని మంత్రి అన్నారు. క్రైస్తవ మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు విస్తృతంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

