నవగీతం, కొడిమ్యాల:
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. మండలంలోని సూరంపేట గ్రామ శివారులో సంచరిస్తున్న పెద్దపులి మరో ఆవును బలితీసుకున్న ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఉదయం గ్రామస్తులు పొలాల వద్దకు వెళ్లిన సమయంలో ఆవు మృతదేహాన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

పులి దాడి చేసిన ఆనవాళ్లను గుర్తించిన అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువులను రాత్రి వేళల్లో బయట వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలిపారు.గత పది రోజులుగా పొరుగు జిల్లాల నుంచి ఒక పెద్దపులి జగిత్యాల జిల్లా అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కొడిమ్యాల మండల పరిసర ప్రాంతాల్లో పులి అడుగుజాడలు కూడా గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.పులి సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే పులిని అడవుల్లోకి తరలించే చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. గ్రామాల పరిసర ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పులి కనిపించినట్లయితే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

