నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ డియం అండ్ హెచ్ ఓ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ , మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్షయవ్యాధి (టిబి) పూర్తిగా నయం చేయగల వ్యాధి అని, సమయానికి పరీక్షలు చేయించుకొని సరైన చికిత్స తీసుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా టిబి వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని ఆయన పేర్కొన్నారు.టి బి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహాలను పాటించడం ద్వారా వ్యాధిని త్వరగా నియంత్రించవచ్చని అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రజల్లో అవగాహన పెంపొందించడమేనని తెలిపారు. టిబి లక్షణాలు, నివారణ చర్యలు, ఉచిత పరీక్షలు మరియు చికిత్సపై వైద్య అధికారులు ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్ పర్సన్ లు పాల్గొని ప్రజలకు సందేశాన్ని చేరవేశారు.ఈ కార్యక్రమంలో డియం అండ్ హెచ్ఓ డా. సుజాత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


