Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలస్టేజీల మీద స్పీచ్‌లు.. ఆచరణలో దళితులపై అణచివేతలా ?

స్టేజీల మీద స్పీచ్‌లు.. ఆచరణలో దళితులపై అణచివేతలా ?

📰 Generate e-Paper Clip

కోరుట్ల గడ్డపై రాజుకున్న రాజకీయ రణరంగం

ఎమ్మెల్యే తీరును ప్రశ్నించిన కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు

నవగీతం ,కోరుట్ల ప్రతినిధి:

కోరుట్ల నియోజకవర్గ రాజకీయాల్లో ఒక్కసారిగా సెగలు రేగాయి. ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి కృష్ణారావు నిప్పులు చెరిగారు. “స్టేజీ ఎక్కితే అంబేద్కర్ ఆశయాలు.. స్టేజీ దిగితే అహంకారపు పోకడలా?” అంటూ జువ్వాడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. అంబేద్కర్ జయంతి వేళ విగ్రహాలకు పూలమాలలు వేస్తూ ఫోజులిస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కు, జువ్వాడి కృష్ణారావు సూటి ప్రశ్నలు సంధించారు. మొన్న మల్లాపూర్ మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం వేళ.. స్థానిక మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఒక దళిత మహిళ అని తెలిసి కూడా ఆమెకు సమాచారం ఇవ్వకుండా ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కడం వెనుక ఉన్న అంతర్యం ఏంటని ప్రశ్నించారు. “నోటితో రాజ్యాంగం గురించి చెబుతూ.. చేతలతో దళితులను అవమానిస్తారా?” అంటూ ఎమ్మెల్యే ముఖానికి అద్దం పట్టారు. కేవలం ప్రజాప్రతినిధులనే కాదు, కనీసం ప్రభుత్వ అధికారులను కూడా గౌరవించలేని స్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని జువ్వాడి ధ్వజమెత్తారు. అంబేద్కర్ జయంతి సాక్షిగా మున్సిపల్ కమిషనర్‌ను, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న తహసీల్దార్‌ను అవమానించడం ఎమ్మెల్యే అహంకారానికి పరాకాష్ట అని మండిపడ్డారు. అధికారులను పనిముట్లుగా చూస్తూ, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న సంజయ్ వైఖరిపై జువ్వాడి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “స్టేజీల మీద నీతులు చెప్పడం కాదు సంజయ్ గారు.. ఆచరణలో దళితులకు, అధికారులకు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. మీ డ్రామాలు ఇక సాగవు” అంటూ జువ్వాడి హెచ్చరించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే, కోరుట్ల ప్రజలు మీ అహంకారానికి తగిన గుణపాఠం చెబుతారని, రానున్న రోజుల్లో రాజకీయంగా మీకు చుక్కలు కనపడటం ఖాయమని జువ్వాడి కృష్ణారావు హెచ్చరికలు జారీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular