నవగీతం,మంచిర్యాల:
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్‌లో భాగంగా పర్యటించారు.ఈ సందర్భంగా వార్డులోని పలు వీధుల్లో కాలినడకన తిరుగుతూ స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ప్రజల సమస్యలు, స్థానిక అవసరాలను స్వయంగా అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. వార్డులో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారులు, డ్రైనేజీ తదితర మౌలిక వసతులపై ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండటమే ప్రజాప్రతినిధుల బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు, కార్యకర్తలు వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.


