Monday, November 2, 2026
ads
Homeజిల్లా వార్తలుహైదరాబాద్నేలకొరిగిన మరో కలం యోధుడు

నేలకొరిగిన మరో కలం యోధుడు

📰 Generate e-Paper Clip

సీనియర్ జర్నలిస్టు శ్రీనివాసరావు మృతి

హైదరాబాద్, అక్టోబర్19,(నవగీతం ప్రతినిధి)

సీనియర్ జర్నలిస్టు వడ్డూరి శ్రీనివాస రావు గుండె పోటుతో ఆదివారం రాత్రి మరణించారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు. వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో నాగోల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అతనికి ఊపిరి తిత్తులు దెబ్బ తిన్నాయని చెప్పారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు వచ్చి మృతి చెందారని శ్రీనివాసరావు సతీమణి లలితా దేవి చెప్పారు. నలభై ఏళ్ళుగా

1986లో జాగృతి పత్రికలో సబ్ ఎడిటర్ గా కెరీర్ ను ప్రారంభించిన వడ్డూరి శ్రీనివాస రావు ముప్పై ఏళ్ళు వివిధ పత్రికలో పని చేశారు. కృష్ణా పత్రిక, వార్త, సాక్షి దినపత్రికల్లో సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేసిన ఆయన ప్రస్తుతం దర్బార్ పేరుతో సొంత వెబ్ సైట్ ను నడుపుతున్నారు.నాలుగు దశాబ్దాలుగా తన కలంతో అక్షరాలు దిద్ది వార్తలుగా మలిచిన శ్రీనివాసరావు నీతీ నిజాయితో పేదరికంలో బతికాడు. తనకు వచ్చిన జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటూ తన ఇద్దరు పిల్లలను చదివించుకున్నారు.

ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలం పొందాలనుకున్న శ్రీనివాసరావు కల నెరవేరకుండానే కన్ను మూశారు. పదిహేనేళ్ళ క్రితం సాక్షిలో పని చేస్తున్నప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్న అతను ఇంటి స్థలం కోసం జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ లో సభ్యత్వం తీసుకొని లక్ష రూపాయలు చెల్లించారు. కొన్నేళ్ళ తర్వాత ఇంటి స్థలం రాకపోవడంతో సొసైటీకి చెల్లించిన డబ్బులు వాపస్ తీసుకున్నారు. ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలం వస్తుందేమో అన్న ఆశతో ఉన్న శ్రీనివాసరావు తిరిగి గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీలో సభ్యుడిగా చేరారు. ఉప్పల్ లో నేటికీ అద్దె ఇంట్లో ఉంటున్న శ్రీనివాసరావు సొంత ఇంటి కల నెరవేరకుండానే చనిపోయారు.

**నిన్న రఘు….నేడు శ్రీనివాసరావు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా జర్నలిస్టులు ఇళ్ళస్థలాలు పొందే అవకాశం లేకుండా పోతుంది. తరాలు మారినా తలరాతలు మారని చందంగా, ప్రభుత్వాలు మారినా… పాత్రికేయులు స్థితి గతులు మారడం లేదు. ఇళ్ళస్థలాల కోసం ఎదిరి చూస్తూ ఎంతోమంది జర్నలిస్టులు చనిపోతున్నారు. నిన్న చనిపోయిన సీనియర్ జర్నలిస్టు రఘు అంత్యక్రియలు  ముగియగానే నేడు సీనియర్ జర్నలిస్టు శ్రీనివాసరావు కన్ను మూశారు.

సీనియర్ జర్నలిస్టు వడ్డూరి శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, తన్నీరు శ్రీనివాస్ లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. 

గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యుడు, సీనియర్ పాత్రికేయుడు వడ్డూరి శ్రీనివాసరావు అకాల మృతికి సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, డైరెక్టర్ యర్రమిల్లి రామారావు లు ఒక ప్రకటనలో సంతాపం తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular