“చదువుకుంటారా.. చదివిస్తా” అంటూ ఆప్యాయంగా పలకరింపు
జగిత్యాల, అక్టోబర్6,(నవగీతం)
చేతుల్లో పుస్తకాలు పట్టుకుని బడికి వెళ్లాల్సిన చిన్నారులు.. బిక్షాపాత్రలు పట్టుకుని రోడ్డుపై నిల్చున్న దృశ్యం జగిత్యాల పట్టణంలో కలచివేసింది. ఎండను సైతం లెక్కచేయకుండా తల్లిదండ్రులతో కలిసి భిక్షాటన చేస్తున్న నాలుగైదేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులను చూసిన జగిత్యాల పట్టణ సీఐ కరుణాకర్ చలించిపోయారు. విధులకు వెళ్తున్న సమయంలో తహసీల్ చౌరస్తా వద్ద ఈ దృశ్యం ఆయన దృష్టికి రావడంతో వెంటనే వాహనాన్ని ఆపి చిన్నారుల వద్దకు వెళ్లారు.
చిన్నారులను ఆప్యాయంగా చేరదీసిన సీఐ కరుణాకర్ వారితో కొద్దిసేపు మాట్లాడారు. “చదువుకుంటారా.. మిమ్మల్ని చదివిస్తా” అంటూ వారిలో భరోసా నింపారు. పోలీసు అధికారి వెంట వస్తామని చిన్నారులు చెప్పడంతో వారిని ఆటోలో ఎక్కించి సురక్షితంగా తరలించారు. అనంతరం జిల్లా బాలల సంరక్షణ అధికారులకు సమాచారం అందించి, చిన్నారుల సంక్షేమం, విద్య, భద్రతకు సంబంధించిన తదుపరి చర్యలు చేపట్టేలా చర్యలు ప్రారంభించారు. సాధారణంగా విధుల్లో భాగంగా వెళ్లిపోకుండా, చిన్నారుల పరిస్థితిని గమనించి వెంటనే స్పందించిన సీఐ కరుణాకర్ చొరవ అభినందనీయం. పోలీసు విధుల్లో నేర నియంత్రణతో పాటు సమాజంలోని బలహీన వర్గాలు, ముఖ్యంగా చిన్నారుల భద్రత, సంక్షేమంపై కూడా పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది.


