ప్రభుత్వ కుట్టు మిషన్ పథకాన్ని ప్రశంసించిన అడువాల జ్యోతి
నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
తెలంగాణలోని వెనుకబడిన తరగతుల (బీసీ) మహిళల ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకంపై మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ప్రభుత్వం బీసీ వర్గాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.ఈ పథకం ద్వారా బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని, కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 1,000 మందికి 100 శాతం సబ్సిడీతో ఆధునిక కుట్టు మిషన్లు ఇవ్వడం మంచి నిర్ణయమన్నారు. నైపుణ్యం ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని స్వయం సమృద్ధి సాధించవచ్చని, గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఇలాంటి పథకాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

