ఉపాధి కూలీలకు పని కల్పించాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి తీసుకువచ్చిన ‘వీబీ- జీరామ్ జీ’ 2025 పథకం ఉపాధి కూలీల పాలిట శాపంగా మారిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈసందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘వీబీ- జీరామ్ జీ’ పథకం ఉపాధి కూలీల పాలిట శాపంగా మారిందని మంత్రి అన్నారు. కూలీ పనులకు వచ్చిన వారి హాజరు వేయడానికి ఐరిస్ పద్దతిలో హాజరు నమోదు చేయడంతో చాలా మంది కూలీల పేర్లు నమోదు కావడం లేదని మంత్రి అన్నారు. ఫలితంగా ఉపాధి కూలీ కోసం వచ్చి తిరిగి వెళుతున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కూలీల పేర్ల నమోదు విషయంలో నిబంధనలు సడలించి ఉపాధి కూలీలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యను రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది అని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మరో మారు వీబీ- జీరామ్ జీ చట్టంపై మరోమారు సమీక్షించి నిబంధనలో మార్పులు తీసుకురావాలని మంత్రి సూచించారు. మంత్రిగా తన మంత్రిత్వ శాఖల కోరకు వారంలో నాలుగు రోజులు హైదరాబాద్ లో పని చేస్తానని ధర్మపురి నియోజకవర్గంలో సమస్యలపరిష్కారం కోసం నియోజకవర్గంలో వారంలో మూడు రోజులు అందుబాటులో ఉంటానని మంత్రి అడ్లూరి తెలిపారు.ప్రతి రోజు ఒక గ్రామంలో పర్యటించి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తానని మంత్రి తెలిపారు. శ్రీరాములపల్లి గ్రామంలో ఇళ్లపై నుంచి వెళ్లుతున్న కరెంటు వైర్ల సమస్యకు పరిష్కారం చూపించడం జరిగింది మంత్రి తెలిపారు.30 ఏళ్లుగా శ్రీరాములపల్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను రెండుసంవత్సరాలలోనే పరిష్కరించినట్లు మంత్రి వివరించారు. గ్రామంలోని ఎస్సారెస్పీ కాలువలో నిండిన పూడిక త్వరలోనే తొలగిస్తామని మంత్రి గ్రామస్తులకు హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామస్తులకు మంత్రి హామీ ఇచ్చారు.

