నవగీతం,కొడిమ్యాల ప్రతినిది:
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన కొండగట్టులో 40వ గిరిప్రదక్షిణ ఘనంగా, భక్తి వాతావరణంలో నిర్వహించబడింది. పూజ్య గురువులు శ్రీ సురేష్ ఆత్మారామ్ మహరాజ్ ఆశీస్సులతో ప్రతి పౌర్ణమికి జరిగే ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం ఈసారి 40 వ మైలురాయిని చేరుకోవడంతో విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 25 వేల మంది భక్తులు ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో పాల్గొన్నారు. ఉదయం 6:30 గంటలకు గురువు కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా గిరిప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా భక్తులందరూ రామనామ సంకీర్తనలతో కొండ చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు.దీంతో అంజన్న క్షేత్రం భక్తిరసంలో తేలియాడింది.భక్తుల సౌకర్యార్థం తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. గిరి ప్రదక్షిణ మార్గమధ్యంలో ముగింపు ప్రదేశంలో ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేసి మజ్జిగ, అరటిపండ్లు, చల్లని మంచినీటిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ, దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలందించిన సంస్థ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.భక్తులు కూడా సేవా సంస్థ సభ్యుల సేవలను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.


