హమాలీల కోరత లేకుండా చర్యలు తీసుకోవాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రి అడ్లూరి
నవగీతం,జగిత్యాల/ బుగ్గారం:
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం మండలంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా బుగ్గారం, గోపులాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. హమాలీల కొరత లేకుండా కాంటాలు పూర్తయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని, హమాలీల సమస్య ఉంటే అదనంగా డబ్బులు చెల్లించి కొనుగోలు పూర్తి అయ్యేవిధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు నిత్యం ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించి కొనుగోలు వేగవంతం అయ్యే విధంగా చూడాలని మంత్రి సూచించారు.బుగ్గారం మండల కేంద్రంలో అదనపు ధాన్యం కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయాలని స్థానిక రైతులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా అందుకు అనుగుణంగా ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గోపులాపూర్ గ్రామంలో రైతులు యూరియా స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని కోరగా సంబంధిత అధికారులతో మాట్లాడిన మంత్రి ఖరీఫ్ సీజన్ కల్లా గోపులాపూర్ రైతులకు యూరియా పాయింట్ అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


