నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిజామాబాద్ ఎంపీ విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కు లేఖ రాసిన ఆయన, చెల్గల్ గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కేటాయించిన 10 ఎకరాల భూమిని కేంద్రీయ విద్యాలయానికి బదలాయించాలని డిమాండ్ చేశారు.
కేంద్రీయ విద్యాలయ సంఘం నిబంధనల ప్రకారం కనీసం 5 ఎకరాల భూమి అవసరం ఉండగా, ప్రభుత్వం కేవలం 2 ఎకరాల భూమిని మాత్రమే ఆమోదించడం దురదృష్టకరమని అన్నారు. చెల్గల్‌లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు 10 ఎకరాల భూమి కేటాయించిన ప్రభుత్వం, కేంద్రీయ విద్యాలయానికి మాత్రం సరైన స్థలం ఇవ్వకపోవడం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని విమర్శించారు.
నర్సింగపూర్ సమీపంలో ప్రతిపాదించిన స్థలానికి సరైన రహదారి, రవాణా సౌకర్యాలు లేవని, చెత్త నిల్వ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో ఆ ప్రదేశం విద్యాసంస్థ ఏర్పాటుకు పూర్తిగా అనర్హమని పేర్కొన్నారు. జగిత్యాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చెల్గల్ గ్రామంలోని 10 ఎకరాల భూమిని వెంటనే కేంద్రీయ విద్యాలయానికి కేటాయించాలని, లేకపోతే విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని సీఎం కు రాసిన లేఖలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు.


