ఆస్తి వివాదమే హత్యాయత్నానికి కారణం – సుపారీ ఇచ్చి హత్యకు కుట్ర
ఉత్తరప్రదేశ్ నుంచి నాటు పిస్టల్ కొనుగోలు – నలుగురు నిందితుల అరెస్ట్
నవగీతం,జగిత్యాల/మెట్ పల్లి:
మెట్‌పల్లి పట్టణంలో ఇటీవల జరిగిన కాల్పుల ఘటన కేసును జగిత్యాల జిల్లా పోలీసులు విజయవంతంగా ఛేదించినట్లు మెట్‌పల్లి డీఎస్పీ ఎ. రాములు వెల్లడించారు. మెట్‌పల్లి సి.ఐ ఆఫీసు లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సొంత అన్న భార్యపై ఆస్తి వివాదాల నేపథ్యంలో ముందస్తు పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన కుట్రదారులతో పాటు మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, హత్యాయత్నానికి ఉపయోగించిన నాటు పిస్టల్, రెండు సజీవ కార్ట్రిడ్జీలు/బుల్లెట్స్, ఒక మోటార్ సైకిల్ మరియు ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు.
ఘటనకు దారితీసిన ఆస్తి వివాదం:
మెట్‌పల్లి పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన గోనెల శంకర్ అలియాస్ జేసీబీ శంకర్ (A-1) గోనెల రాజం సొంత అన్నదమ్ములు. కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమి మరియు నివాస గృహానికి సంబంధించి చాలా కాలంగా ఇరు కుటుంబాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో A-1 గోనెల శంకర్, అతని భార్య గోనెల అనూష (A-2), కుటుంబ సభ్యులకు తెలియకుండా గోదూర్ రోడ్డులో ఉన్న సుమారు 58 గుంటల వ్యవసాయ భూమిని విక్రయించడంతో పాటు నివాస గృహాన్ని కూడా అనూష పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ విషయమై రాజం మరియు అతని భార్య గోనెల లక్ష్మి తమ వాటా కోరుతూ ప్రశ్నించడంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి.ఈ ఆస్తి వివాదాల నేపథ్యంలో 2020లో ఒకసారి, 2023లో మరోసారి లక్ష్మి మరియు ఆమె భర్తపై కర్రలతో దాడి చేసి ప్రాణహాని బెదిరింపులకు పాల్పడగా, ఆ రెండు సందర్భాల్లోనూ మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ వివాదాలు కొనసాగుతుండటంతో, లక్ష్మి అడ్డుగా ఉంటే ఆస్తి మొత్తం తమ ఆధీనంలోకి రాదనే ఉద్దేశ్యంతో ఆమెను హత్య చేయాలని A-1, A-2 మరియు A-3 కుట్ర పన్నారు.
హత్యకు సుపారీ
యూపీ డ్రైవర్‌ను ప్రలోభపెట్టిన నిందితులు ఆస్తి వివాదాన్ని శాశ్వతంగా ముగించేందుకు గోనెల శంకర్ (A-1), అతని భార్య అనూష (A-2) మరియు వారి బంధువు గోపి ముత్తయ్య (A-3) తమ వద్ద జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రయాగ్‌రాజ్ జిల్లాకు చెందిన సచిన్ కుమార్ అలియాస్ సచిన్ వర్మ (A-4)ను సంప్రదించారు.సచిన్ కుటుంబ ఆర్థిక పరిస్థితి, అతనికి ఉన్న కుటుంబ బాధ్యతలు మరియు సౌదీ అరేబియాకు వెళ్లాలనే ఆశను ఆసరాగా చేసుకుని, లక్ష్మిని హత్య చేస్తే భారీ మొత్తంలో డబ్బుతో పాటు సౌదీ వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహాయం కూడా అందిస్తామని ఆశ చూపి హత్యకు ఒప్పించారు. దీంతో A-4 వారి ప్రతిపాదనకు అంగీకరించాడు. ఉత్తరప్రదేశ్ నుంచి నాటు పిస్టల్ కొనుగోలు: ముందస్తు పథకం ప్రకారం A-4 సచిన్ వర్మ 2026 మార్చి నెలలో ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాడు. అక్కడ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద ఒక అపరిచిత సాధువు నుంచి రూ.40,000/- చెల్లించి ఒక నాటు పిస్టల్ మరియు మూడు సజీవ కార్ట్రిడ్జీలను కొనుగోలు చేశాడు. ఇందుకోసం A-1 తన ఫోన్‌పే ఖాతా ద్వారా రూ.35,000/- పంపించాడు.తదనంతరం తేది 10-03-2026న సచిన్ ఆ నాటు పిస్టల్ మరియు కార్ట్రిడ్జీలను మెట్‌పల్లికి తీసుకొచ్చి గోనెల శంకర్‌కు అప్పగించాడు.హత్యకు కుట్ర: నిందితులు పలుమార్లు సమావేశమై హత్యను ఏ విధంగా అమలు చేయాలి, అనంతరం పోలీసుల దర్యాప్తును ఎలా తప్పుదోవ పట్టించాలి అనే అంశాలపై ముందుగానే ప్రణాళిక రూపొందించారు.వేసవి కాలంలో గోనెల లక్ష్మి మరియు ఆమె భర్త ఇంటి ముందు వరండాలో నిద్రించే అలవాటు ఉండటంతో అదే అవకాశాన్ని ఉపయోగించుకుని కాల్చి చంపాలని నిర్ణయించారు. అనంతరం బయట నుంచి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు లేదా దోపిడీదారులు కాల్పులు జరిపినట్లుగా నమ్మించే కథనం సృష్టించాలని కూడా ముందుగానే కుట్ర పన్నారు.తేది 09-06-2026న A-1, A-2, A-3 మరియు A-4 సమావేశమై హత్య అమలుకు సంబంధించిన తుది కార్యాచరణ రూపొందించారు.కాల్పులు జరిగిన తర్వాత ఒకరితో ఒకరు మొబైల్ ఫోన్ ద్వారా మాట్లాడకుండా, అవసరమైతే ప్రత్యక్షంగా మాత్రమే కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా చేస్తే పోలీసులకు ఎలాంటి సాంకేతిక ఆధారాలు లభించవని భావించారు.

హత్యాయత్నం
సచిన్ వర్మ మొదటి ప్రయత్నం 6వ నెల 13 వ తేదీ రోజున నాటు పిస్టల్‌తో లక్ష్మి ఇంటి వద్దకు వెళ్లినప్పటికీ భయంతో కాల్పులు జరపకుండా తిరిగి వెళ్లిపోయాడు.రెండో ప్రయత్నంగా 6వ నెల 15వ తేదీ అర్ధరాత్రి 1.30 గంటలకు)A-1, A-2 మరియు A-3 ప్రోత్సాహంతో A-4 తన ముఖానికి రుమాలు కట్టుకొని A-1కు చెందిన హోండా పాషన్ ప్రో మోటార్ సైకిల్‌పై లక్ష్మి ఇంటికి వెళ్లాడు. ముందుగా పరిస్థితిని గమనించి, అనంతరం ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించి వరండాలో నిద్రిస్తున్న గోనెల లక్ష్మిపై నాటు పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. అయితే బుల్లెట్ లక్ష్యాన్ని తప్పి బాధితురాలి ఎడమ చెంప భాగంలో తగిలింది. కాల్పుల శబ్దం వినిపించడంతో A-4 అక్కడి నుంచి పరారయ్యాడు.కాల్పుల అనంతరం నిందితులు ఈ ఘటనను గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు, కర్రలతో దాడి చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. A-1 తనకు ఏమీ తెలియనట్లు పొరుగువారికి ఫోన్ చేసి నాటకం ఆడగా, A-4ను వెంటనే ఉత్తరప్రదేశ్‌కు పంపించి కేసులో ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
పోలీసుల దర్యాప్తు బాధితురాలికి జరిగిన శస్త్రచికిత్సలో ముఖం నుంచి బుల్లెట్ బయటకు రావడంతో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాలు, ఆర్థిక లావాదేవీలు, మొబైల్ విశ్లేషణ మరియు నిందితుల కదలికలను సమగ్రంగా పరిశీలించి హత్యకు పన్నిన కుట్రను ఛేదించారు.అంతర్రాష్ట్ర స్థాయిలో దర్యాప్తు నిర్వహించి ప్రధాన నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేసి కేసును విజయవంతంగా ఛేదించిన మెట్‌పల్లి సీఐ బి. సురేష్ బాబు, ఎస్‌ఐ పి. కిరణ్ కుమార్ మరియు దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.

