చోద్యం చూస్తున్న అధికారులు
సమీక్ష సమావేశానికి సర్పంచ్ అల్లుడు హాజరు
“మహిళా ప్రజాప్రతినిధులకు ఇదేనా గౌరవం?” అంటూ గ్రామస్తుల ఆవేదన
నవగీతం,మల్లాపూర్:జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల, గ్రామాభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రోటోకాల్ ఉల్లంఘన చోటుచేసుకుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, సంబంధిత అధికారులు పాల్గొన్న ఈ సమావేశానికి వాల్గొండ గ్రామ సర్పంచ్ శ్రీమతి తోపారపు వసంత అల్లుడు శాఖపురపు కిరణ్ హాజరుకావడం వివాదాస్పదంగా మారింది. ఆయన ప్రజాప్రతినిధి కాదని, వాల్గొండ గ్రామ ఓటరు కూడా కాదని, అంతేకాకుండా జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తి కూడా కాదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ అధికారులు సమావేశంలో పాల్గొనేందుకు అనుమతించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం,వాల్గొండ గ్రామ పంచాయతీలో కూడా సర్పంచ్ స్థానంలో అల్లుడే అధికారాలు చలాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన వారితో “మీరేమైనా చేసుకోండి.. నేనే సర్పంచ్”అంటూ ఆయన మాట్లాడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై సర్పంచ్ స్పందించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోందని పేర్కొంటున్నారు.మహిళలకు స్థానిక సంస్థల్లో కల్పించిన రాజ్యాంగబద్ధ హక్కులు,గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, వాస్తవాలపై విచారణ జరిపి,బాధ్యులైన అధికారులతో పాటు సంబంధిత ప్రజాప్రతినిధిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


