16వ వార్డులో ఉచిత స్టీల్ బ్యాంక్ సేవలు ప్రారంభం
మెట్పల్లి, సెప్టెంబర్ 13 (నవగీతం): వినాయక చవితి సందర్భంగా 16వ వార్డు ప్రజల కోసం ఉచిత స్టీల్ బ్యాంక్ సేవా పథకాన్ని ఆదివారం కౌన్సిలర్ అరిసె వనజ మురళి వాడకట్టు ప్రజల మధ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ అరిసె వనజ మురళి మాట్లాడుతూ.. ఇంట్లో జరిగే వివిధ శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వినియోగాన్ని పూర్తిగా నివారించాలనే ఉద్దేశంతో స్టీల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్టీల్ బ్యాంక్‌లో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఇంట్లో కార్యక్రమం నిర్వహించుకునే వారు ఒక రోజు ముందుగా తమ పేరును నమోదు చేసుకుంటే వారికి అవసరమైన స్టీల్ ప్లేట్లు, గ్లాసులను పూర్తిగా ఉచితంగా అందజేస్తామని తెలిపారు. ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం ద్వారా పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొడ్ల రమేష్, అరిగెల అనుష రాకేష్, గోపి, కిరణ్, వెంకటేష్, తిరుపతి, జలంధర్ తదితర వార్డు ప్రజలు పాల్గొన్నారు.
